Karnataka: ‘కర్ణాటక’ బాగుపడాలంటే ‘కాంగ్రెస్’ను ఓడించాలి : ప్రధాని మోదీ
- తుమకూరులో బహిరంగ సభలో మాట్లాడిన మోదీ
- కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు రెండూ తోడుదొంగలు
- బీజేపీ అధికారంలోకి వస్తేనే కర్ణాటకలో అభివృద్ధి సాధ్యం
కర్ణాటక రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఈరోజు ఉదయం తుమకూరులో నిర్వహించిన ఓ బహిరంగసభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి అవినీతి, నల్లధనంపై ఉన్న ఆసక్తి రాష్ట్రాభివృద్ధిపై లేదని అన్నారు. తుమకూరు ప్రాంతంలో హేమావతి నది ప్రవహిస్తున్నప్పటికీ ఇక్కడి వాసులకు తాగునీటి కష్టాలు తప్పట్లేదని, తాగునీటిని సరఫరా చేసే విషయంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు రెండూ తోడుదొంగలని, ప్రజలను మభ్య పెట్టేందుకు ఆ రెండు పార్టీలు చూస్తున్నాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నప్పటికీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే కర్ణాటకలో అభివృద్ధి సాధ్యమవుతుందని.. తమ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లను మోదీ కోరారు.