roja: అందుకే, చంద్రబాబు దాచేపల్లి బాధితురాలిని పరామర్శించారు: రోజా
- నెల వ్యవధిలో గుంటూరులో చాలా దారుణాలు జరిగాయి
- ఒక్కరిని కూడా చంద్రబాబు పరామర్శించలేదు
- మేము చేస్తున్న పోరాటం వల్లే చంద్రబాబు దిగి వచ్చారు
- చంద్రబాబు తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు
గుంటూరు జిల్లా దాచేపల్లిలో అత్యాచారానికి గురైన బాలికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ... నెల వ్యవధిలో గుంటూరులో ఎన్నో అత్యాచార ఘటనలు వెలుగులోకొచ్చాయని, చంద్రబాబు నాయుడు వారిలో ఎవరినైనా పరామర్శించారా? అని ఆమె నిలదీశారు.
తాము చేస్తున్న పోరాటం వల్లే చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు దిగి వచ్చి కనీసం దాచేపల్లి బాలికను పరామర్శించారని రోజా చెప్పుకొచ్చారు. చంద్రబాబు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికే బాధితురాలి బంధువులను తన పక్కన కూర్చోబెట్టుకుని మీడియాతో మాట్లాడారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు నాయుడికి బాధితురాలి వివరాలు చెప్పకూడదన్న నిబంధనలు తెలియదా? అని రోజా ప్రశ్నించారు. గతంలో ఏపీలో సంచలనం రేపిన రిషితేశ్వరి కేసులోనూ సెటిల్ మెంట్ చేశారని, అలాగే కాల్ మనీ సెక్స్ రాకెట్లో టీడీపీ నేతలు ఉండంతో ఆ కేసును నీరుగార్చారని రోజా విమర్శించారు. ఇలా చాలా కేసుల్లో నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు.