Congress: మా పార్టీ 'ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్' కోసమే: మోదీకి సిద్ధరామయ్య కౌంటర్
- కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాక కాంగ్రెస్ పరిస్థితిపై మోదీ ఎద్దేవా
- కాంగ్రెస్ పార్టీ పీపీపీకే పరిమితం అవుతుందన్న ప్రధాని
- పీ-పంజాబ్, పీ-పుదుచ్చేరి, పీ-పరివార్ అని వివరణ
- దీటుగా సమాధానం ఇచ్చిన సిద్ధరామయ్య
కర్ణాటకలో ఈ నెల 12న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ... ఈ నెల 15న ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కాంగ్రెస్ పార్టీ పీపీపీకే పరిమితం అయిపోతుందని అన్నారు. అంటే మొదటి పీ-పంజాబ్‌ని, రెండో పీ-పుదుచ్చేరిని మూడో పీ-పరివార్ (కాంగ్రెస్ కుటుంబం)ని సూచిస్తుందని ఎద్దేవా చేశారు. పంజాబ్, పుదుచ్చేరిల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.
మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అదే రీతిలో చురకలంటించారు. పీపీపీలకు కొత్త వివరణ ఇస్తూ తాము ఎలప్పుడూ ఆ విషయాల్లో విజేతలమేనని అన్నారు. ప్రజా స్వామ్యంలో పీపీపీ ఉంటాయని, అవి ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్ అని ట్వీట్ చేశారు. కాగా, బీజేపీ మాత్రం నిజంగా మరో మూడు పీపీపీల పార్టీ అని, పీ-ప్రిజన్ (జైలు), పీ-ప్రైస్ హైక్ (ధరల పెరుగుదల), పీ-పకోడా (పకోడి) పార్టీ అని కౌంటర్ ఇచ్చారు.