Tirumala: సర్వదర్శనానికి టైమ్ స్లాట్ పెట్టిన తరువాత తొలిసారి... నేటి కోటా ఫుల్!
- వేసవి రద్దీ, వారాంతపు సెలవులు
- భక్తులతో తిరుమల కిటకిట
- టైమ్ స్లాట్ దర్శనానికి 24 గంటల సమయం
తిరుమలలో సామాన్య భక్తులు క్యూలైన్ లోకి వెళ్లిన తరువాత గరిష్ఠంగా మూడు గంటల్లోనే స్వామివారిని దర్శించుకుని బయటకు రావాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన సర్వదర్శనం టైమ్ స్లాట్ నేటి కోటా ముగిసిపోయిందని, ఇప్పుడు స్వామి దర్శనానికి వచ్చే వారికి 20 నుంచి 24 గంటల తరువాత మాత్రమే దర్శనం కల్పించగలమని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డుతో వచ్చే భక్తులకు టైమ్ స్లాట్ విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
వేసవి రద్దీ, వారాంతపు సెలవుల కారణంగా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకోవడంతోనే నేటి కోటా ముగిసిందని, దాదాపు 25 వేల మందికి పైగా నేడు దర్శనం నిమిత్తం సమయం ఇచ్చామని అధికారులు వెల్లడించారు. ఇక రేపు దర్శనానికి స్లాట్ తీసుకున్న భక్తులు వేచి ఉండే సమయంలో తిరుపతి, తిరుమల ప్రాంతాల్లోని మిగతా ఆలయాలు, సమీప పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఆధార్ లేదా ఓటరు కార్డు లేనివారు నారాయణగిరి గార్డెన్స్ లోని ప్రవేశమార్గం ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించి, వేచి ఉండి దర్శనం చేసుకోవాలని వెల్లడించారు.