Khammam District: ప్రియుడిని నమ్మించి పిలిపించి.. సినీ ఫక్కీలో హత్య చేయించిన మహిళ!
- ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలో వ్యక్తి మృతి
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
- విచారించగా వెల్లడైన విస్తుపోయే నిజం
ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలో ఇటీవల మరణించిన ఆటో డ్రైవర్ ఉమాబాబు అలియాస్ తమ్మన్న (25) కేసును ఛేదించిన పోలీసులు, విస్తుపోయే నిజాలను వెలికితీశారు. ఉమాబాబుతో వివాహేతర బంధం పెట్టుకున్న కల్పన అనే మహిళ, అతన్ని నమ్మించి, పిలిపించి, తన భర్త సాయంతో హత్య చేసిందని తేల్చారు.
మరిన్ని వివరాల్లోకి వెళితే, దంతెల బోర గ్రామానికి చెందిన ఇస్తారయ్య హోమ్ గార్డుగా పనిచేస్తుండగా, అతనికి కల్పన అనే భార్య ఉంది. అదే గ్రామంలో ఆటో డ్రైవర్ గా ఉన్న ఉమాబాబుకు కల్పనతో వివాహేతర సంబంధం ఏర్పడగా, ఆరు నెలల క్రితం గ్రామంలోనే పంచాయితీ నిర్వహించి, అతన్ని పెద్దలు హెచ్చరించారు. అయినా ఉమాబాబు పద్ధతి మార్చుకోకపోవడంతో అతన్ని హత్య చేయాలని భావించిన ఇస్తారయ్య, అందుకు తన భార్యనే పావుగా ప్రయోగించాడు.
తన భార్యతో అతనికి ఫోన్ చేయించి భద్రాచలం రావాలని చెప్పించాడు. అతను రాకపోవడంతో పాల్వంచలోని ఓ గుడి వద్దకు వచ్చి కలవాలని చెప్పించాడు. అక్కడికి ఉమాబాబు రాగా, కల్పన అతన్ని సుందరయ్య నగర్ కు తీసుకెళ్లింది. వీరు వెళ్లే సరికి ఇస్తారయ్య, అతని బావమరిది సీతారాములు, ఆయన భార్య నిర్మల అక్కడే ఉన్నారు. లోపలికి రాగానే ఉమాబాబును చుట్టుముట్టిన అందరూ మెడకు టవల్ బిగించి హత్య చేశారు.
ఆపై ఇస్తారయ్య బైక్ నడుపుతుండగా, మధ్యలో శవాన్ని పెట్టుకుని కల్పన కూర్చోగా శ్మశానానికి వెళ్లారు. ఆత్మహత్య చేసుకున్నట్టుగా కనిపించాలని నోటిలో పురుగుల మందు పోసి వెళ్లిపోయారు. ఈ మృతిని అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులు, ఉమాబాబు ఫోన్ కాల్స్ ఆధారంగా విచారించగా, కల్పన పేరు బయటకు వచ్చింది. ఆపై తమదైన శైలిలో విచారణ చేయగా, మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్ట్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు.