China: అంతా కొత్తవారితో మరో 'బాహుబలి': సంచలన ప్రకటన చేసిన శోభూ యార్లగడ్డ
- చైనాలో దుమ్ముదులుపుతున్న బాహుబలి
- మీడియాతో మాట్లాడిన శోభూ యార్లగడ్డ
- ఆగస్టు నుంచి ప్రీక్వెల్ సిరీస్ షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడి
తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చూపిన 'బాహుబలి-2' ఇప్పుడు చైనాలో దుమ్ము దులుపుతున్న వేళ, చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. మరో నిర్మాత దేవినేని ప్రసాద్ తో కలసి మీడియాతో మాట్లాడిన ఆయన, బాహుబలి ప్రీక్వెల్ ను త్వరలోనే నిర్మించనున్నట్టు తెలిపారు. ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఆన్ లైన్ సిరీస్ గా ఈ ప్రీక్వెల్ ను నిర్మిస్తామని తెలిపారు. దీని చిత్రీకరణ ఆగస్టు నుంచి మొదలవుతుందని చెప్పారు. ఈ ప్రీక్వెల్ లో అంతా కొత్త నటీ నటులు కనిపిస్తారని, శివగామి చిన్నతనం నుంచి మాహిష్మతి సామ్రాజ్యం విస్తరించిన తీరును చూపిస్తామని చెప్పారు.
ఇప్పటికే ఉన్న మాహిష్మతి సెట్ తో పాటు మరికొన్ని సెట్స్ వేసి దీన్ని షూట్ చేయనున్నామని, మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. కాగా, రచయిత ఆనంద్ నీలకంఠన్ ఇప్పటికే 'ది రైజ్ ఆఫ్ శివగామి' పేరిట బుక్ రాసి, దాన్ని నవలగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాని ఆధారంగానే ఈ ప్రీక్వెల్ ఉంటుందని తెలుస్తోంది. దీనిలో శివగామి చిన్నతనం, మాహిష్మతికి కోడలు కావడం, కట్టప్ప ఎక్కడివాడు? ఎందుకు రాజ్యానికి బానిస అయ్యాడు? తదితరాంశాలకు చోటుంటుందని సమాచారం.