Narendra Modi: మోదీ సార్.. మీ పార్టీ వీటికి దూరం కనుక మీకు అర్థం కాలేదు!: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
- ‘కాంగ్రెస్’ను పీపీపీగా మోదీ సంబోధించడంపై మండిపడ్డ సిద్ధరామయ్య
- పీపీపీ అంటే పంజాబ్, పుదుచ్చేరి పరివార్ కాదు!
- దాని అర్థం .. ‘ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్’
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నిన్న పలు జిల్లాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన విమర్శలు గుప్పించారు. మే 15 తర్వాత ‘కాంగ్రెస్’ జాతీయ పార్టీగా కాకుండా కేవలం ప్రాంతీయ పార్టీగా మిగిలిపోతుందని, ఇకపై ‘కాంగ్రెస్’ ను పీపీపీ (పంజాబ్, పుదుచ్చేరి పరివార్)గా సంబోధించవచ్చని మోదీ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. ఓ ట్వీట్ ద్వారా మోదీపై విమర్శలు గుప్పించారు. ‘మోదీ సార్.. పీపీపీ అంటే.. పంజాబ్, పుదుచ్చేరి పరివార్ కాదు! దాని అర్థం నేను చెబుతాను. పీపీపీ అంటే ‘ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్’ అనేది అసలు అర్థం. మీ పార్టీ వీటికి దూరం కనుక, అవి మీకు అర్థం కాలేదు’ అని విమర్శించారు. ఇదే ‘పీపీపీ’ని బీజేపీకి అన్వయించిన సిద్ధరామయ్య కొత్త భాష్యం చెప్పారు. ‘పీపీపీ అంటే..ప్రిజన్, ప్రైస్ రైజ్, పకోడా’ నేను చెప్పింది నిజమే కదా మోదీ సార్?’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.