Physics: నీట్... చుక్కలు చూపించిన ఫిజిక్స్... మిగతావి ఈజీ!
- నిన్న దేశవ్యాప్తంగా నీట్
- బయాలజీ, కెమిస్ట్రీతో పోలిస్తే కష్టంగా ఫిజిక్స్ ప్రశ్నలు
- సమయాన్ని తినేశాయంటున్న విద్యార్థులు
నిన్న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ (నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్)లో ఒక్క భౌతికశాస్త్రం నుంచి వచ్చిన ప్రశ్నలు మినహా, మిగతా సబ్జెక్టులు సులువుగానే ఉన్నట్టు పరీక్ష రాసిన అభ్యర్థులు అంటున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే సులువుగానే క్వశ్చన్ పేపర్ ఉందని రెండోసారి పరీక్షకు హాజరైన అభ్యర్థులు అంటున్నారు. ఫిజిక్స్ మాత్రం చుక్కలు చూపించిందని, ఆ తరువాత కెమిస్ట్రీ కొంచెం కఠినంగా ఉండగా, బయాలజీ సులువుగా అనిపించిందని చెబుతున్నారు. పరీక్ష క్వాలిఫైయింగ్ మార్కులు 135గా ఉండచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఫిజిక్స్ లో 2, కెమిస్ట్రీలో 1, బయాలజీలో 9 అత్యంత క్లిష్టమైన ప్రశ్నలు రాగా, ఫిజిక్స్ లో 43, కెమిస్ట్రీలో 44, బయాలజీలో 81 ప్రశ్నలు ఓ మోస్తరు కష్టంగా వచ్చాయని, ఇంటర్ రెండో సంవత్సరం సిలబస్ నుంచి ఫిజిక్స్ లో 24, కెమిస్ట్రీలో 20, బయాలజీలో 46 ప్రశ్నలు రాగా, తొలి సంవత్సరం సిలబస్ నుంచి ఫిజిక్స్ లో 21, కెమిస్ట్రీలో 20, బయాలజీలో 44 ప్రశ్నలు వచ్చాయని విద్యార్థులు వెల్లడించారు.
ఫిజిక్స్ ప్రశ్నలు సమయాన్ని తినేశాయని నీట్ టెస్ట్ కోసం ఏడాది బ్రేక్ తీసుకుని శిక్షణ పొందిని డీ అమిత్ అనే విద్యార్థి వెల్లడించాడు. ఇంటర్ లో 992 మార్కులు సంపాదించిన పీ గాయత్రి స్పందిస్తూ, "బయాలజీలో ప్రశ్నలు చాలా సులువుగా ఉన్నాయని నా స్నేహితులు అంటున్నారు. నేను రాసిన మాక్ టెస్టులతో పోలిస్తే బయాలజీ కూడా క్లిష్టంగానే ఉంది" అని వ్యాఖ్యానించింది.