BANKS ATM: 2,000కుపైగా ఏటీఎంలను శాశ్వతంగా మూసేసిన బ్యాంకులు
- పీఎన్ బీ 1,122, కెనరా బ్యాంకు 997 ఏటీఎంల తొలగింపు
- ఖర్చులు తగ్గించుకోవడం కోసమే
- ఫిబ్రవరి నాటికి ఏటీఎంల సంఖ్య 1,07,630
పోటీతత్వంతో ఏటీఎంలను విరివిగా తెరిచేసిన బ్యాంకులు ఇప్పుడు వాటిని మూసేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి. ఒకటి, రెండు కాదు, ఏకంగా 2,000కు పైగా ఏటీఎంలను ఆయా బ్యాంకులు శాశ్వతంగా మూసేశాయి. రిజర్వ్ బ్యాంకు దగ్గరున్న డేటా ఈ విషయాన్ని తెలియజేస్తోంది.
2017 మే నెల నుంచి 2018 ఫిబ్రవరి వరకు పది నెలల కాలంలో ఈ ఏటీఎంలను రద్దు చేసే కార్యక్రమం నడిచింది. 2017 మే నెల నాటికి బ్యాంకు ఏటీఎంలు 1,10,116 ఉన్నాయి. 2018 ఫిబ్రవరి నాటికి వాటి సంఖ్య 1,07,630కు తగ్గాయి. బ్యాంకులు ఖర్చులు తగ్గించుకోవడానికి ఏటీఎంలను తగ్గించుకున్నాయని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. బ్యాంకు ఆఫ్ ఇండియా 208 ఏటీఎంలు, కెనరా బ్యాంకు 997 ఏటీఎంలు, సెంట్రల్ బ్యాంకు 344 ఏటీఎంలు, పంజాబ్ నేషనల్ బ్యాంకు 1,122 ఏటీఎంల చొప్పున తగ్గించుకున్నాయి.