kamal nath: అలాంటి సంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో లేదు!: కమల్ నాథ్
- కాంగ్రెస్ పార్టీలో ఆ సంప్రదాయం లేదు
- మధ్యప్రదేశ్ లో ఎన్నికలకు ఒక ముఖం చాలదు
- బీజేపీ సర్కారును ఓడిస్తామని ప్రకటన
ఎన్నికల ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో లేదని ఆ పార్టీ మధ్యప్రదేశ్ విభాగం నూతన ప్రెసిడెంట్ కమల్ నాథ్ అన్నారు. ఒకవేళ రాహుల్ గాంధీ అవసరం అని భావిస్తే సీఎం అభ్యర్థి పేరును ప్రకటించొచ్చన్నారు. మధ్యప్రదేశ్ అన్నది సంక్లిష్టమైన రాష్ట్రమని, ఇక్కడ ఎన్నికలను ఒకే ముఖం (ఒక్క నేత) ఎదుర్కోలేదని, ఎన్నో ముఖాలు అవరమని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ ప్రజలు శివరాజ్ సింగ్ ప్రభుత్వం పట్ల ఆగ్రహంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ మెరుగ్గా ప్రచారం నిర్వహించగలదని కమల్ నాథ్ అన్నారు. సమయం తక్కువగా ఉన్నప్పటికీ పార్టీని బలోపేతం చేసి బీజేపీ సర్కారును ఓడించే విషయంలో సందేహం అక్కర్లేదన్నారు. కమల్ నాథ్ (71) కాంగ్రెస్ పార్టీ తరఫున మధ్యప్రదేశ్ లోని చింద్వారా స్థానం నుంచి తొమ్మిది సార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రి పదవిని కూడా ఆయన నిర్వహించారు.