ke krishna murthy: ఏపీలో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి: కేఈ కృష్ణమూర్తి
- భూదార్ కింద 11 అంకెలతో కూడిన విశిష్ట సంఖ్యను కేటాయిస్తాం
- భూములకు సంబంధించిన వివరాలన్నీ ఇందులో ఉంటాయి
- ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోంది
రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చామని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. అన్ని రకాల భూములను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు భూసేవ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. ఆధార్ తరహాలోనే భూధార్ కార్యక్రమం కింద 11 అంకెలతో కూడిన విశిష్ట సంఖ్యను కేటాయిస్తామని... భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం ఇందులో పొందుపరుస్తామని తెలిపారు.
అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో కేఈ మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. ఇదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయాలనుకుంటోందని, రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆయన విమర్శించారు. ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఊహించని మలుపులు తిరుగుతున్నాయని చెప్పారు. హక్కుల సాధన కోసమే చంద్రబాబు పోరాటం చేస్తున్నారని అన్నారు.