Karnataka: 'ఆగ్రహ హనుమాన్'ను తొలిసారి చూపించాడు... ప్రధాని మోదీ ప్రశంసలు పొంది ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు!
- కోపంతో నిప్పులు చెరిగే హనుమంతుడి బొమ్మ గీసిన ఆచార్య
- కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించిన నరేంద్ర మోదీ
- చాలా ఆనందంగా ఉందంటున్న ఆచార్య
వీరాంజనేయుడైనా, అభయాంజనేయుడైనా శాంతమూర్తిగా కనిపించే ఆంజనేయుడిని, 'ఆగ్రహ హనుమాన్'గా తొలిసారి పరిచయం చేసిన కళాకారుడు ఆచార్య, తనకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు రావడంపై ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. సిందూరం, నలుపు వర్ణాలు కలగలుపుతూ, కోపంతో చూస్తున్న ఆంజనేయుని చిత్రం ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న నరేంద్ర మోదీ, ఈ చిత్రాన్ని ప్రస్తావించి, ఆచార్యను గుర్తు చేసుకున్నారు.
ఇక మోదీ నోటి వెంట తన పేరు వచ్చినప్పటి నుంచి తెలిసిన వారంతా కాల్ చేసి అభినందిస్తుంటే, తన జీవితంలో తాను సాధించిన అతిపెద్ద విజయం ఇదేననిపిస్తోందని, తన పెయింటింగ్ ను మోదీ ప్రస్తావించారన్న విషయాన్ని తొలుత తాను నమ్మనేలేదని, ఆపై ఎంతో ఆనందం వేసిందని మీడియాతో చెప్పారు. ఏదైనా వినూత్నంగా చిత్రం గీయాలని ప్రయత్నించి ఈ చిత్రాన్ని గీశానని చెప్పారు. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం వైరల్ అయిందని, వందలాది కార్లు, బైకులపై తన బొమ్మను చూసుకుంటుంటే పట్టరాని సంతోషం కలుగుతోందని, ఓ కళాకారుడికి ఇంతకన్నా కావాల్సిందేముంటుందని ఆచార్య వ్యాఖ్యానించారు.