Telangana: తెలంగాణలో 145 కొత్త 108 అంబులెన్స్ వాహనాలు ప్రారంభం

  • తెలంగాణ అవిర్భావం తర్వాత వైద్య శాఖ బలోపేతం
  • మొబైల్ వైద్య సేవలను మరింత మెరుగు పరచాం
  • ఎమర్జెన్సీ వాహనాల్లో పని చేసేవారికి శిక్షణ ఇచ్చాం
  • వివరించిన లక్ష్మారెడ్డి

తెలంగాణ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఈ రోజు హైద‌రాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో కొత్త 108 వాహనాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ అవిర్భావం తర్వాత వైద్య శాఖను బలోపేతం చేస్తున్నామని, మొబైల్ వైద్య సేవలను కూడా మరింత మెరుగు పరచామని అన్నారు. ఎమర్జెన్సీ 108, అమ్మ ఒడి 102, పార్థివ వాహనాలు, 108 బైక్ వాహనాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆయా వాహనాలలో పని చేసే సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇచ్చామని తెలిపారు.

తెలంగాణలో 'ఎమర్జెన్సీ 108' వాహనాలు మొత్తం 316 పని చేస్తున్నాయని, అందులో 145 పాత వాహనాలను తొలగించి 145 కొత్త వాహనాలను ప్రారంభించామని లక్ష్మారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ గారి సూచనలతో వైద్య శాఖ అభివృద్ధి పథంలో నడుస్తోందని చెప్పారు.
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ దత్తాత్రేయ మాట్లాడుతూ... రాష్ట్రానికి కేంద్ర సహకారం పూర్తిగా ఉందని, ఎయిమ్స్ ని తెలంగాణలో ప్రారంభించడానికి కేంద్ర సర్కారు చర్యలు వేగవంతం చేసిందని తెలిపారు. ఎయిమ్స్ తెలంగాణకి రావడం శుభ సూచకమని, అంబులెన్స్ సేవలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని అన్నారు. ఎమర్జెన్సీ వైద్య సేవలు త్వరితగతిన అందుతున్నాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ సూచనలతో, మంత్రి లక్ష్మారెడ్డి బాగా పని చేస్తున్నారని, వైద్యశాఖ పనితీరు బాగా మెరుగు పడిందని అన్నారు. కంటి పరీక్షలు కూడా రాష్ట్ర ప్రజలందరికీ చేస్తున్నామని, విదేశాల మాదిరిగా రాష్ట్రంలో ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నారని, ప్రతి ఒక్కరికి ఎక్కడైనా వైద్యం అందించడానికి వీలు అవుతుందని తెలిపారు.

అనంతరం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ... కేసీఆర్ సీఎం అయ్యాక ఆరోగ్య శాఖ బాగా పని చేస్తోందని, ఎమ్‌ఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిలో రూ.18 కోట్ల విలువైన పరికరం పెట్టామని, అలాగే బస్తి దవాఖానాలు పెట్టామని అన్నారు గతంలో ప్రైవేట్ ఆసుపత్రులకి ఉపయోగపడేలా వైద్య శాఖ పనితీరు ఉండేదని, ఇప్పుడు సర్కార్ దవాఖానాలకే ప్రజలు వచ్చేలా, ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నారని చెప్పారు. స్వయంగా గవర్నర్ నరసింహన్‌ గాంధీ దవాఖానలో వైద్యం చేయించుకున్నారని, ఆయన స్వయంగా పరిశీలించి ప్రభుత్వ సేవలను కొనియాడారని తెలిపారు.

  • Loading...

More Telugu News