bbc: కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బీబీసీ పేరిట ఫేక్ న్యూస్ ప్రచారం
- బీజేపీకి 135 సీట్లు వస్తాయని ప్రచారం
- స్పష్టతనిచ్చిన బీబీసీ
- తాము ఎటువంటి సర్వే చేయలేదని ట్వీట్
మరో నాలుగు రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తమదే విజయం అంటూ బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ చెప్పుకుంటున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ప్రత్యర్థుల అసమర్థతలను ఎండగడుతున్నాయి. కర్ణాటకలో హంగ్ ఏర్పడుతుందని పలు సర్వేలు చెబుతోంటే, మరో వైపు ఇటీవల బీబీసీ పేరిట ఓ ఫేక్ న్యూస్ హల్ చల్ చేసింది.
బీజేపీ 135 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్‌కి కేవలం 35 సీట్లే దక్కుతాయని, ఇక జేడీఎస్‌కి 45, ఇతరులకి 19 సీట్లు దక్కుతాయని అందులో పేర్కొన్నారు. నిజానికి కర్ణాటక అసెంబ్లీ సీట్లు 224 మాత్రమే. అయితే, పైన పేర్కొన్న వివరాల ప్రకారం 135..45..35..19 మొత్తం కలిపి 234 సీట్లు అవుతున్నాయి.
దీనిపై స్పందించిన బీబీసీ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సర్వే అంటూ తమ సంస్థ పేరిట వాట్సప్‌లో ఓ ఫేక్‌న్యూస్ ప్రచారం అవుతోందని, అది బీసీసీ నుంచి వచ్చిన న్యూస్ కాదని, అసలు తాము ఇండియాలో ప్రీ-ఎలక్షన్స్ సర్వే చేయలేదని ట్విట్టర్‌లో పేర్కొంది. ఈ ఫేస్‌న్యూస్ జన్ కీ బాత్ పేరిట బీబీసీ కర్ణాటక ఎన్నికలపై సర్వే నిర్వహించినట్లు ప్రచారం అవుతోంది.