vijay mallya: విజయ్ మాల్యాకు షాక్.. లిక్కర్ కింగ్‌కు వ్యతిరేకంగా తీర్పు చెప్పిన రెండు కోర్టులు
- ఒకే రోజు షాకిచ్చిన రెండు బ్యాంకులు
- భారతీయ బ్యాంకులకు బకాయిలు చెల్లించాల్సిందేనన్న లండన్ కోర్టు
- ఫెరా కింద మాల్యా ఆస్తులు జప్తు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశం
భారత్‌లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్, ఢిల్లీ కోర్టులు షాకిచ్చాయి. ఒకే రోజు రెండు కోర్టులు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పాయి. ఐడీబీఐ బ్యాంక్‌సహా దేశంలోని బ్యాంకులకు మాల్యా ఎగవేసిన రూ.10,385 కోట్ల (155 కోట్ల డాలర్లు)ను చెల్లించాల్సిందేనని గతేడాది డెట్ రికవరీ ట్రైబ్యునల్ (డీఆర్టీ) తీర్పు చెప్పింది. ఇప్పుడా తీర్పును అమలు చేయాల్సిందేనని లండన్‌లోని ఓ న్యాయస్థానం తీర్పు చెప్పింది.
మాల్యా కావాలనే ఈ రుణాలను ఎగవేసినట్టు భారత బ్యాంకులు చేసిన ఆరోపణలను న్యాయమూర్తి ఆండ్రూ హెన్షా ఆమోదించారు. తాజా తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కోర్టు తీర్పుతో గతంలో డీఆర్టీ ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేసే వీలు చిక్కిందని భారత బ్యాంకుల తరపున వాదించిన న్యాయసేవల సంస్థ టీఎల్టీ పేర్కొంది.
మరోవైపు ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులోనూ మాల్యాకు మంగళవారం చుక్కెదురు అయింది. విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం (ఫెరా) కింద మాల్యా నుంచి రావాల్సిన బకాయిలను రాబట్టుకునేందుకు అతడి ఆస్తులను జప్తు చేయాలని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దీపక్ షెరావత్ ఆదేశించారు.