Andhra Pradesh: ఈనెల 11 నుంచి తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేయనున్న వర్షాలు!
- మూడు రోజులపాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు
- దేశవ్యాప్తంగా విభిన్న వాతావరణ పరిస్థితులు
- హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ
భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈనెల 11 నుంచి మూడు రోజులపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా రానున్న ఐదు రోజుల్లో వివిధ ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండనున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈనెల 11 నుంచి మూడు రోజులపాటు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తాయని వివరించింది. వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని సూచించింది. 11, 12 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
దేశ వ్యాప్తంగా నెలకొన్న విభిన్న వాతావరణ పరిస్థితులపై ఐఎండీ డైరెక్టర్ కె.జయరాం రమేశ్ మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బస్ షెల్టర్లు, ఇనుముతో చేసిన నిర్మాణ ప్రాంతాల్లో ఉండవద్దని హెచ్చరించారు.