lalu prasad yadav: కుమారుడి పెళ్లి వేడుక కోసం ఐదు రోజుల పెరోల్ కోరిన లాలూ
- ఈ నెల 12న కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం
- 10 నుంచి 14 వరకు పెరోల్ పై విడుదల చేయాలని కోరిన లాలూ
- పెరోల్ రాకపోతే డిజిటల్ సాధనాలే దిక్కు
దాణా స్కాం దోషిగా జైలు జీవితం గడుపుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహానికి హాజరయ్యేందుకు గాను ఐదు రోజుల పెరోల్ కోసం జార్ఖండ్ జైలు శాఖా ఐజీకి దరఖాస్తు చేసుకున్నారు. తేజ్ ప్రతాప్ వివాహం ఈ నెల 12న జరగనుంది. ఈ నెల 10 నుంచి 14 వరకు పెరోల్ మంజూరు చేయాలని కోరారు. దీని కంటే ముందే లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ కోసం జార్ఖండ్ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
ప్రస్తుతం లాలూ జార్ఖండ్ లోని బిర్సాముండా సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇటీవలే ఆయన చికిత్స కోసం కొన్నాళ్ల పాటు ఢిల్లీ ఎయిమ్స్ లో ఉన్న విషయం తెలిసిందే. పెరోల్ మంజూరవుతుందన్న ఆశాభావాన్ని ఆర్జేడీ ఎమ్మెల్యే బోలాయాదవ్ వ్యక్తం చేశారు. పెరోల్ రాకపోతే కనుక డిజిటల్ సాధనాల ద్వారా లాలూ తన కుమారుడి పెళ్లి చూడాల్సి రావచ్చు.