bajaj new bikes: బజాజ్ నుంచి త్వరలో ఏడు కొత్త బైక్ లు.. వాటి వివరాలు!
- పల్సర్ శ్రేణిలో నాలుగు నూతన మోడళ్లు
- 125 సీసీ, ఎన్ఎస్ 180 విడుదలకు ప్రయత్నాలు
- ‘వి’ శ్రేణిలో 100సీసీ బైక్
బజాజ్ ఆటో నుంచి ఏడు కొత్త బైక్ లు రానున్నాయి. అయితే, వాటిలో కొన్ని ఈ ఏడాది వచ్చేవి అయితే కొన్ని మరుసటి ఏడాది రానున్నాయి.
పల్సర్ 125
పట్టణాల్లో రోజువారీ కార్యాలయాలకు వెళ్లొచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని బజాజ్ పల్సర్ 125ను తీసుకురానుందని సమాచారం. ఇందులో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉండనుంది. పల్సర్ 150సీసీని కొనుగోలు చేయలేని తక్కువ బడ్జెట్ వర్గాలకు అనుగుణంగా ధర ఉంటుందని భావిస్తున్నారు.
పల్సర్ ఎన్ఎస్180
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180కి పోటీగా బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 180ని తీసుకురానుంది. ఇది ఎన్ఎస్ 200 మాదిరే ఉంటుంది. కాకపోతే టైర్లు చిన్న సైజువి. ఇతర కొన్ని పార్ట్ లలో మార్పులు ఉంటాయి.
పల్సర్ 150 సరికొత్తగా
పల్సర్ వయసు 17 ఏళ్లు. కనుక కొత్త రూపంతో పల్సర్ 150ని కంపెనీ ఆవిష్కరించనుంది. 2019లో ఇందుకు సంబంధించిన పనులు జరగనున్నాయి. కొత్త డిజైన్, కొత్త ఫ్రేమ్, నూతన ఇంజన్ తో వస్తుందని భావిస్తున్నారు.
పల్సర్ 250
పల్సర్ విభాగంలో కొత్తగా 250సీసీ మోడల్ ను తీసుకురానుంది. ఆర్ఎస్ 200, డామినార్ 400 మధ్య స్థాయిలో దీన్ని ప్రవేశపెట్టనుంది.
బజాజ్ అవెంజర్ 400
అవెంజర్ శ్రేణిలో కొంచెం పెద్ద పరిమాణంలో 373సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ తో బైక్ ను బజాజ్ ప్రవేశపెట్టనుంది. బజాజ్ నుంచి ఖరీదైన మోటార్ సైకిల్ ఇదే కానుంది. దీని ధర రూ.2 లక్షలుగా ఉంటుందని సమాచారం.
బజాజ్ వి10
బజాజ్ వి15, వి12 విజయాలతో ఇదే శ్రేణిలో వి10 పేరుతో 100సీసీ మోాటార్ సైకిల్ ను బజాజ్ ఆటో తీసుకురానుంది. ప్రారంభ స్థాయి మార్కెట్లో మరింత పాగా వేసేందుకు ఈ బైక్ అనుకూలిస్తుందని భావిస్తోంది కంపెనీ.
డామినార్ ఏడీవీ
డామినార్ లో బజాజ్ అడ్వెంచర్ వేరియంట్ ను ప్రవేశపెట్టనుంది. రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయాన్ కు ఇది పోటీ కానుంది. డామినార్ 400 కంటే ఇది ఓ రూ.10,000 ఎక్కువ ధర ఉండనుంది.