China: చైనాకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులో కాసేపు ప్రయాణించిన కేసీఆర్
- ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తామన్న కేసీఆర్
- బీవైడీ ఆటో ఇండస్ట్రీ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధులతో భేటీ
- హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ లో చర్చలు
హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించనున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీతో పాటు జీహెచ్ఎంసీలో క్రమంగా వాటి వినియోగాన్ని పెంచుతామని, ప్రైవేటు సంస్థలు కూడా వాటిని కొనుగోలు చేసేలా అవగాహన కల్పిస్తామని చెప్పారు. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ ఆటో ఇండస్ట్రీ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధులు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ లో ఈ రోజు కేసీఆర్‌ను కలిశారు.
వంద శాతం బ్యాటరీతో నడిచే వాహనాల తయారీ పరిశ్రమను స్థానిక కంపెనీలతో కలిసి హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్లు, చైనా బయట ఈ పరిశ్రమ నెలకొల్పడం ఇదే ప్రథమమని అన్నారు. దీంతో కేసీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ... ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని అన్నారు. నగరాలు, పట్టణాల్లో వాహనాలు వెదజల్లే కాలుష్యం పెరిగిపోతోందన్నారు. బీవైడీ రూపొందించిన ఎలక్ట్రిక్ బస్సుల్లో కేసీఆర్ కాసేపు ప్రయాణించారు.
అనంతరం బస్సు నాణ్యతాప్రమాణాలు బాగున్నాయని, సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు కాలుష్యరహిత వాతావరణానికి చాలా అనువుగా ఉందని కేసీఆర్ అభినందించారు. ఈ బస్సులు మూడు గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతాయని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300-400 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.