Medak District: దేశ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా పయనిస్తా: సీఎం కేసీఆర్
- నేను ఇచ్చిన మాట ప్రకారం మెదక్ పట్టణాన్ని జిల్లాగా ఏర్పాటు చేశా
- కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనాలకు పునాది రాళ్లు వేశా
- నా జన్మధన్యమైంది.. చాలా తృప్తిగా ఉంది
- గుండెల నిండా సంతోషంగా ఉంది
దేశ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా పయనిస్తానని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఇందుకు ప్రజలు అంగీకరిస్తే.. తాను దేశ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా అడుగులు వేస్తానని చెప్పారు. మెదక్ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ‘దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలి. మెదక్ చైతన్యవంతమైన జిల్లా. కవులు, కళాకారులు, గొప్ప పాత్రికేయులు.. అందరూ ఉన్నటువంటి గడ్డ ఇది. నేను కూడా ఈ గడ్డమీద పుట్టా, ఇక్కడి నీళ్లు తాగే ఈరోజు ఈ స్థాయికి వచ్చా.
ఆ రోజున నేను ఇచ్చిన మాట ప్రకారం.. మెదక్ పట్టణాన్ని జిల్లాగా ఏర్పాటు చేశా. చాలా తక్కువ మంది మనుషులకు నాకు వచ్చిన అవకాశం వస్తుంది. మెదక్ టౌన్ జిల్లా కేంద్రం కావాలని కోరుకున్నా. నేను బతికుండగానే మెదక్ ని జిల్లా చేశాను. అదే విధంగా, నా చేతులతోనే కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు పునాది రాళ్లు వేయడంతో నా జన్మధన్యమైంది. ఈ అవకాశం నాకు లభించినందుకు చాలా తృప్తిగా.. గుండెల నిండా సంతోషంతో ఉన్నా. ఈ ఏడాది చివరి నాటికి మెదక్ జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు నీరు అందుతుంది’ అని అన్నారు.