lalu: ఆర్జేడీ అధినేత లాలూకు పెరోల్ మంజూరు!
- మూడు రోజుల పెరోల్ మంజూరు
- లాలూ మీడియాతో మాట్లాడకూడదు
- ఏ పార్టీ నేత ఆయన్ని కలవకూడదని కోర్టు నిబంధనలు
దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు పెరోల్ లభించింది. ఈ నెల 12న లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో తనకు పెరోల్ ఇవ్వాలని కోరుతూ లాలూ చేసిన వినతిపై జార్ఖండ్ న్యాయస్థానం స్పందించింది. మూడు రోజుల పెరోల్ కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు రాంచీలోని బిర్సా ముందా జైలు ఐజీ హర్ష్ మంగళ తెలిపారు. దీంతో ఈరోజు సాయంత్రం పట్నాకు లాలూ బయలుదేరి వెళ్లనున్నారు.
పెరోల్ పై బయట ఉన్న మూడు రోజులు మీడియాతో లాలూ మాట్లాడకూడదని, ఏ పార్టీ నేత, కార్యకర్త ఆయన్ని కలిసేందుకు, మాట్లాడేందుకు వీలు లేదని కోర్టు నిబంధనలు విధించినట్టు చెప్పారు. లాలూకు మూడు రోజుల పాటు బీహార్, జార్ఖండ్ పోలీసులు భద్రత కల్పిస్తారని, ఆయనకు కేటాయించిన భద్రతా బలగాల్లో నలుగురు డీఎస్పీలను నియమించినట్టు చెప్పారు.