Vijayawada]: ‘ప్రత్యేక హోదా’ కోసం ‘జాగారం’ ప్రారంభించిన హీరో శివాజీ
- విజయవాడలోని ధర్నాచౌక్ లో ‘జాగారం’ ప్రారంభం
- రేపు ఉదయం ఏడు గంటల వరకు కొనసాగింపు
- శివాజీ చేస్తున్న పోరాటానికి పలువురి మద్దతు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హీరో శివాజీ ‘జాగారం’ ప్రారంభించారు. విజయవాడలోని ధర్నాచౌక్ లో ఈరోజు రాత్రి ఏడు గంటలకు ఆయన ‘జాగారం’ ప్రారంభమైంది. రేపు ఉదయం ఏడు గంటల వరకు ఈ నిరసన దీక్ష కొనసాగుతుంది. ఏపీకి హోదా సాధన కోసం అన్ని పార్టీలు ఒకే గొడుగు కిందకు రావాలంటూ, అన్ని పార్టీల జెండాలను గొడుగు కింద అమర్చారు. కాగా, శివాజీ చేస్తున్న పోరాటానికి టీడీపీ నేత బోండా ఉమ, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు, పలు సంఘాలు సంఘీభావం తెలిపాయి.
అంతకుముందు శివాజీ విలేకరులతో మాట్లాడుతూ, మోదీ, అమిత్ షా పట్ల దేశ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, కర్ణాటకలో బీజేపీ గెలిచినా బాధపడాల్సిన అవసరం లేదని, ఎందుకంటే, 2019 ఎన్నికల్లో మోదీకి దేశ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఏపీ ప్రజలను బిచ్చగాళ్లలా కేంద్రం చూస్తోందని, ఏపీలోని రాజకీయపార్టీలన్నీ ఒకే వేదికపైకి వచ్చి పోరాడాలని పిలుపు నిచ్చారు.
మన పిల్లల భవిష్యత్తు కోసం మన హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, రాష్ట్రంలోని కొన్ని పార్టీలు బీజేపీతో లోపాయికారిగా పనిచేస్తున్నాయని, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్టు నటిస్తున్నాయని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలయ్యే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని మరోసారి శివాజీ స్పష్టం చేశారు.