Hyderabad: అభిమానుల అనుమానాలను పటాపంచలు చేసిన సన్ రైజర్స్.. ఢిల్లీపై ఘనవిజయం!
- భారీ స్కోరును సునాయాసంగా ఛేదించిన సన్ రైజర్స్
- ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకున్న వైనం
- ఈ సీజన్ లో ప్లే ఆఫ్ కు చేరుకున్న తొలి జట్టు మనదే
హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఉన్న బలం బౌలింగే... గట్టిగా నిలబడి బ్యాటింగ్ చేసే వారేరి? ఓ భారీ స్కోరును ఛేదించాల్సి వస్తే పరిస్థితేంటి? ప్లే ఆఫ్ లో భారీ స్కోరును ఎదుర్కోవాల్సి వస్తే ఓడిపోవాల్సిందేనా? ఇవి గత నెల రోజులుగా సన్ రైజర్స్ అభిమానులను వేధిస్తున్న ప్రశ్నలు. దానికి తగ్గట్టుగానే జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తూ, అంతంతమాత్రం స్కోరునే నమోదు చేస్తూ వచ్చింది. అయినా, తనకున్న అద్భుతమైన బౌలింగ్ బలంతో స్వల్ప స్కోరులను కాపాడుకుంటూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
ఇక గత రాత్రి ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో డేర్ డెవిల్స్ తో ఆడిన హైదరాబాద్ జట్టు ఏకంగా 187 పరుగుల స్కోరును ఛేదించి, తాము బ్యాటింగ్ లోనూ తక్కువేమీ కాదని నిరూపించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 187 పరుగులు చేయగా, సగటు సన్ రైజర్స్ అభిమాని మ్యాచ్ పోయిందనే భావించాడు. డేర్ డెవిల్స్ లో రిషబ్ పంత్ 63 బంతుల్లో 128 పరుగులు చేసి, భారీ స్కోరుకు బాటలేశాడు. ఆపై 188 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ 18.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 191 పరుగులు చేయడం ద్వారా ఈ సీజన్ లో ప్లే ఆఫ్ కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. ధావన్ 50 బంతుల్లో 92, విలియమ్సన్ 53 బంతుల్లో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.