Unnavo: భర్తపై ఉన్న రేప్ కేసు మాఫీ చేయిస్తామంటూ బేరం.. 'ఉన్నావో' ఎమ్మెల్యే భార్య ఫిర్యాదుతో దుండగుల అరెస్ట్!
- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో రేప్ కేసు
- ప్రస్తుతం జైలులో నిందితుడు కుల్దీప్ సింగ్ సెంగార్
- సీబీఐ అధికారినంటూ ఫోన్ చేసిన దుండగుడు
- పోలీసులకు ఫిర్యాదుతో జైలుపాలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో రేప్ కేసులో నిందితుడు కుల్దీప్ సింగ్ సెంగర్ ప్రస్తుతం జైలులో ఉండగా, ఈ కేసు నుంచి ఆయన్ను బయటకు తెస్తామని, అందుకోసం తమకు రూ. కోటి ఇవ్వాలంటూ, బీజేపీ నాయకుల పేరిట సెంగార్ భార్య సంగీతాను డిమాండ్ చేసి కటకటాల పాలయ్యారు ఇద్దరు ప్రబుద్ధులు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓ మహిళపై అత్యాచారం కేసులో సీబీఐ విచారణను కుల్దీప్ సింగార్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తానో బీజేపీ నాయకుడినని సంగీతకు ఫోన్ చేసి పరిచయం చేసుకున్న అలోక్ అనే వ్యక్తి, ఆమె భర్తను బయటపడేసేందుకు కోటి అడిగాడు.
తన వద్ద అంత డబ్బు లేదని ఆమె చెప్పడంతో రూ. 50 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. ఆ మరుసటి రోజు విజయ్ అనే వ్యక్తి ఫోన్ చేసి, తనపేరు రాజీవ్ మిశ్రా అని, సీబీఐ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నానని, డబ్బును లక్నోలోని సీబీఐ కార్యాలయానికి తెచ్చిస్తే సింగార్ ను తప్పిస్తామని చెప్పాడు. ఈ విషయాన్ని తన బంధువులకు సంగీత చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆపై ఈ కాల్స్ ను ట్రాక్ చేసిన పోలీసులు ఘాజీపూర్ కు చెందిన నిందితులు అలోక్, విజయ్ లను అరెస్ట్ చేశారు.