lalu prasad yadav: మెడికల్ గ్రౌండ్స్ కింద లాలూకు ప్రొవిజినల్ బెయిల్ మంజూరు
- లాలూకు ఆరు వారాల బెయిల్ మంజూరు చేసిన జార్ఖండ్ హైకోర్టు
- పెరోల్ ముగియగానే తిరిగి జైలుకు వెళ్లనున్న లాలూ
- ఆ తర్వాత ఈ బెయిల్ పై విడుదల కానున్న ఆర్జేడీ అధినేత
పశు దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెరోల్ పై బిర్సా ముందా జైల్ నుంచి విడుదలైన విషయం తెలిసిందే. తన తనయుడు తేజ్ ప్రతాప్ వివాహం నిమిత్తం లాలూకు మూడు రోజుల పెరోల్ లభించింది. బిర్సా ముందా జైలు నుంచి నిన్న సాయంత్రం పాట్నా చేరుకున్నారు. తాజాగా, లాలూకు ప్రొవిజినల్ బెయిల్ లభించింది. మెడికల్ గ్రౌండ్స్ కింద ఆరు వారాల బెయిల్ ను లాలూకు మంజూరు చేస్తున్నట్టు జార్ఖండ్ హైకోర్టు పేర్కొంది.
లాలూ ప్రసాద్ యాదవ్ తరపున న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, ప్రభాత్ కుమార్ జార్ఖండ్ హైకోర్టుకు ఈరోజు హాజరయ్యారు. కాగా, 12 వారాల ప్రొవిజినల్ బెయిల్ మంజూరు చేయాల్సిందిగా లాలూ తరపు న్యాయవాదులు తమ పిటిషన్ లో కోరారు. అయితే, హైకోర్టు 6 వారాల బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది.
ఈ సందర్భంగా లాలూ తరపు న్యాయవాది ప్రభాత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, మెడికల్ గ్రౌండ్స్ నేపథ్యంలో లాలూకు ఈ ప్రొవిజినల్ బెయిల్ మంజూరు చేశారని చెప్పారు. జైలు నుంచి లాలూ విడుదలైన తేదీ నుంచి ఈ బెయిల్ వర్తిస్తుంది. లాలూకు నిన్న మంజూరు చేసిన మూడు రోజుల పెరోల్ ముగియగానే, రాంచీ జైలుకు ఆయన తిరిగి వెళతారని చెప్పారు. ప్రొవిజినల్ బెయిల్ కు సంబంధించిన ఉత్తర్వులు జైలు అధికారులకు చేరగానే, ఈ బెయిల్ కింద లాలూను మెడికల్ చెకప్ నిమిత్తం విడుదల చేస్తారని ప్రభాత్ కుమార్ తెలిపారు.