priti zinta: ప్రతీజింటా-వీరేంద్ర సెహ్వాగ్ మధ్య వివాదం లేదు... అంతా బాగానే ఉంది: కింగ్స్ పంజాబ్ జట్టు
- ప్రతీ మ్యాచ్ పై విశ్లేషణ జరుగుతుంది
- తద్వారా పనితీరు మెరుగుపరుచుకుంటాం
- దీన్ని ప్రతికూలంగా ప్రచారం చేయడం విచారకరమని ప్రకటన
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతిజింటా, జట్టు మార్గదర్శకుడు వీరేంద్ర సెహ్వాగ్ మధ్య వివాదం నెలకొన్నట్టు వచ్చిన వార్తలను జట్టు ఖండించింది. తమ కంటే బలహీన జట్టు రాజస్థాన్ రాయల్స్ చేతిలో కింగ్స్ ఎలెవన్ ఓడిపోవడంతో మార్గదర్శకుడైన సెహ్వాగ్ పై జింటా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలను ఖండిస్తూ అంతా మంచిగానే ఉందని పంజాబ్ జట్టు ప్రకటించింది.
కేవలం 158 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ జట్టు సాధించలేకపోవడంతో అసలు విజయానికి ఏ వ్యూహాలు అనుసరిస్తున్నారంటూ జింటా ఆగ్రహం చెందినట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ‘‘కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విషయంలో ఎన్నో పుకార్లు చోటు చేసుకున్నాయి. యాజమాన్య ప్రక్రియలో భాగంగా ప్రతీ మ్యాచ్ తర్వాత అధికారికంగా, అనధికారికంగా చర్చలు జరుగుతుంటాయి. దీని ద్వారా ఫలితాలను విశ్లేషించి తదుపరి మ్యాచ్ లో పనితీరు మెరుగుపరచుకోవడంపై దృష్టి సారిస్తాం. దీన్ని ప్రతికూల ధోరణిలో చూపించడం విచారకరం. ఇది మా ప్రతిష్టను దెబ్బతీస్తుంది’’ అని పంజాబ్ జట్టు వివరణ ఇచ్చింది.