karnataka: వీలైనంత త్వరగా ఓటు వేయండి: కర్ణాటక ఓటర్లకు వాతావరణ శాఖ హెచ్చరిక
- కర్ణాటకలోని 30 జిల్లాల్లో 23 జిల్లాలకు భారీ వర్ష సూచన
- ఆలస్యం చేయకుండా ఓటు వేయాలంటూ ప్రకటన
- రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
కర్ణాటక అసెంబ్లీకి నేడు పోలింగ్ జరుగుతోంది. ఒకటి రెండు ఘటనలు మినహా అన్ని చోట్లా ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మరోవైపు, ఓటర్లకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. కర్ణాటకలోని 30 జిల్లాల్లో 23 జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, ఓటర్లంతా వీలైనంత త్వరగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించింది. మిగిలిన ఏడు జిల్లాల్లో మాత్రం వర్షం కురవదని చెప్పింది. రాయచూర్, కొప్పల్, బీదర్, యాద్గిరి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని... మరో నాలుగు రోజుల పాటు వర్షాలు ఉంటాయని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులకు ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పలు సూచనలు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఓటర్లకు ఇబ్బంది కలగకుండా సహాయకచర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పారు.