Karnataka: ‘కాంగ్రెస్’ గెలుపును ఎవరూ ఆపలేరు: సీఎం సిద్ధరామయ్య
- సిద్ధరామహుండీలో ఓటు వేసిన సిద్ధ రామయ్య
- కర్ణాటకలో మోదీ హవా లేదు
- ‘కాంగ్రెస్’కు సంపూర్ణ మెజార్టీ లభించడం ఖాయం
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని సీఎం సిద్ధరామయ్య అన్నారు. మైసూరులోని సిద్ధరామహుండీలో ఆయన తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, కర్ణాటకలో మోదీ హవా లేదని, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హంగ్ వచ్చే ప్రసక్తే లేదని, తమ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లభించడం ఖాయమని చెప్పిన సిద్ధరామయ్య, యడ్యూరప్ప మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ మల్లికార్జున ఖర్గే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీకి 70 సీట్లకు మించి రావని, అధికారం కోసం బీజేపీ నేతలు కలలు కంటున్నారని విమర్శించారు.
‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కనకపుర నియోజకవర్గంలో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు వేయడమనేది ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.