Congress: ఏ మీట నొక్కినా బీజేపీకే ఓటు పడుతోంది: కర్ణాటక కాంగ్రెస్ నేత
- ఈవీఎంలలో లోపాలున్నాయి
- తప్పులు దొర్లుతున్నాయి
- ఈ వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళతాం
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు పలు ఆరోపణలు చేస్తున్నారు. ఈవీఎంలలో లోపాలున్నాయని, తప్పులు దొర్లుతున్నాయని ఆ పార్టీ నేత బ్రిజేష్ కాలప్ప ట్విట్టర్లో ఆరోపణలు గుప్పించారు. తాము ఈ వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళతామని, బనహట్టిలో రెండు గంటల పాటు పోలింగ్ నిలిచిపోయిందని తెలిపారు.
బెంగళూరులోని ఆర్‌ఎంవీ సెకండ్ స్టేజ్‌లో తమ తల్లిదండ్రుల అపార్ట్మెంట్ ముందు 5 పోలింగ్ బూత్‌లు ఉన్నాయని, అందులోని 2వ బూత్‌లో ఏ మీట నొక్కినా బీజేపీకే ఓట్లు పడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై ఆగ్రహించిన ఓటర్లు ఓటు వేయకుండానే తిరిగివెళ్లిపోతున్నారని ఆయన తెలిపారు.
బ్రిజేష్ మరో ట్వీట్ చేస్తూ రామానగర, చామరాజ్‌పేట్, హెబ్బల్ తో పాటు రాష్ట్రంలోని పలుచోట్ల ఈవీఎం, వీవీపీఏటీల్లో లోపాలున్నాయని, ఈ విషయంపై తమకు 3 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.