amezon: మరోసారి భారతీయుల నుంచి విమర్శలు ఎదుర్కుంటోన్న అమెజాన్
- ఓ సమావేశానికి సంబంధించి బ్రోచర్ల ముద్రణ
- భారత పటాన్ని తప్పుగా ప్రచురించిన వైనం
- విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ముంబయిలో జరిగిన ఓ సమావేశానికి సంబంధించి కొన్ని బ్రోచర్లు ముద్రించగా, వాటిలో భారత పటాన్ని తప్పుగా ప్రచురించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై ఎట్టకేలకు స్పందించిన ఆ సంస్థ విచారం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇటువంటి తప్పులు మళ్లీ జరగకుండా తమ టీమ్‌తో కలిసి పనిచేస్తున్నామని అమెజాన్ కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
అమెజాన్ గతంలోనూ ఇటువంటి చర్యలకే పాల్పడి భారతీయుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తమ వెబ్‌సైట్‌లో మహాత్మాగాంధీ బొమ్మతో కూడిన చెప్పులను అమ్మకానికి పెట్టడం, తమ కెనడా వెబ్‌సైట్ లో భారత జాతీయ జెండా ఉన్న డోర్‌మ్యాట్లను అమ్మకానికి ఉంచడం వంటి చర్యలకు పాల్పడింది. అప్పట్లో ఆ విషయాలపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.