Nairuti: నాలుగు రోజుల ముందుగానే రుతుపవనాలు: స్కైమెట్
- 28న కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు
- మరో వారంలో అండమాన్ దీవులకు
- ఆపై 24 నాటికి శ్రీలంకకు.. అంచనా వేసిన స్కైమెట్
ఈ వర్షాకాల సీజన్ లో నైరుతి రుతుపవనాలు నాలుగు రోజుల ముందుగానే కేరళను తాకనున్నాయి. ఈ నెల 28న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ వెల్లడించింది. వాస్తవానికి జూన్ 1న ఇవి కేరళకు చేరాల్సివుండగా, ఈసారి నాలుగు రోజుల ముందే రానున్నాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది.
మరో వారంలో... అంటే, మే 20న అండమాన్ నికోబార్ దీవులను తాకనున్న రుతుపవనాలు, 24 నాటికి శ్రీలంకకు వస్తాయని స్కైమెట్ అంచనా వేసింది. కాగా, ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం ఉంటుందని భారత వాతావరణ సంస్థతో పాటు స్కైమెట్ సైతం అంచనా వేసిన సంగతి తెలిసిందే.