Noura Hussein: భర్త రేప్ చేశాడని ఆరోపిస్తూ చంపేసిన భార్య... మరణశిక్ష విధించిన న్యాయస్థానం!
- సూడాన్ లో ఘటన
- 15 ఏళ్లకే వివాహం, ఆపై బలవంతం
- భర్తను హత్య చేయగా విచారించిన కోర్టు
- బాధితురాలిని కాపాడాలంటూ నిరసనలు
తన భర్త అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ, అతన్ని దారుణంగా హతమార్చిన భార్యకు సూడాన్ న్యాయస్థానం మరణదండన విధించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని మీడియా సంస్థలూ ప్రముఖంగా కవర్ చేసిన ఈ వార్తపై మరిన్ని వివరాల్లోకి వెళితే, 19 సంవత్సరాల సూడన్ యువతి నౌరా హుస్సేన్ కు 15 ఏళ్ల వయసులోనే వివాహం అయింది. చిన్న వయసులో వివాహం ఇష్టం లేని ఆమె, ఇంట్లోంచి పారిపోయి మూడేళ్లు శరణార్థిగా తలదాచుకుంది. ఆపై ఆమె తండ్రి గుర్తించి, ఇంటికి తీసుకెళ్లి, భర్త కుటుంబానికి అప్పగించాడు.
ఆమెతో సంసారం చేయాలని ప్రయత్నించి పదే పదే విఫలమైన భర్త బంధుమిత్రులతో నచ్చజెప్పాలని ప్రయత్నించాడు. అయితే, తనకు జరిగింది పెళ్లే కాదని చెబుతుండే ఆమె శోభనానికి నిరాకరిస్తూ వచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన భర్త, తన బంధువుల్లోని ఇద్దరి సాయంతో ఆమెను బలవంతం చేశాడు. ఆమెను కొట్టి మంచంపై పడేసి ఒకరు తల, మరొకరు కాళ్లను గట్టిగా పట్టుకోగా, అత్యాచారం చేశాడు. ఆ మరుసటి రోజు మరోమారు ఇదే ప్రయత్నం చేయబోగా, అప్పటికే తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న కత్తితో అతన్ని పొడిచింది. ఆపై తన తల్లిదండ్రులను సహాయం కోరగా, వారు సాయపడకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, మానవ హక్కుల సంఘాలు నౌరాకు అండగా నిలిచాయి. అయితే, సూడాన్ లో 10 సంవత్సరాలకే ఆడపిల్లకు వివాహం చేయవచ్చు. వివాహం తరువాత వైవాహిక బంధం, భర్త చేసే అత్యాచారం కూడా అక్కడ చట్ట సమ్మతమే. దీంతో నౌరా చేసింది ఘోరమైన తప్పని నిర్ధారించిన ఓమ్డుర్మాన్ న్యాయస్థానం, ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. ఇదే సమయంలో భర్త తరపు కుటుంబీకులు క్షమాపణలు చెబితే ఆమె శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఇస్తున్నట్టు తెలిపింది. ఇక నౌరాను రక్షించాలంటూ 'జస్టిస్ ఫర్ నౌరా', 'సేవ్ నౌరా' హ్యాష్ టాగ్ లు వైరల్ అవుతుండగా 'చేంజ్ డాట్ ఆర్గ్'లో ఓ పిటిషన్ కూడా పెట్టారు.