somu veerraju: కన్నాకు అధ్యక్ష పదవితో ఏపీ బీజేపీలో ముసలం.. అజ్ఞాతంలోకి సోము వీర్రాజు!

  • అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన సోము వీర్రాజు
  • దక్కకపోవడంతో కినుక
  • రాజీనామా చేసిన మద్దతుదారులు

సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి దక్కడాన్ని సోము వీర్రాజు వర్గం జీర్ణించుకోలేకపోతోంది. చివరి వరకు ఆ పదవి తనకు దక్కుతుందని ఆశించి భంగపడిన వీర్రాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆదివారం సాయంత్రం వరకు అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న ఆయన అకస్మాత్తుగా ఎవరికీ అందుబాటులోకి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం కలకలం రేపుతోంది.

మరోవైపు రాత్రి ఎనిమిది గంటల సమయంలో సోము వర్గం తమ పదవులకు రాజీనామా చేసింది. తమ నేత వీర్రాజుకు అధ్యక్ష పదవి ఇవ్వనందుకు నిరసనగానే రాజీనామాలు చేసినట్టు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాలకొండయ్య, రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు తెలిపారు. రాజీనామా పత్రాలను జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు పంపినట్టు పేర్కొన్నారు.
 
హరిబాబు రాజీనామా తర్వాత ఆ పదవి తనకే దక్కుతుందని వీర్రాజు మొదటి నుంచి ఆశలు పెట్టుకున్నారు. ఏ రకంగా చూసినా అధ్యక్ష పదవి తననే వరిస్తుందని పలుమార్లు సన్నిహితుల వద్ద పేర్కొన్నారు. అయితే, పార్టీకి తొలి నుంచి సేవలు అందిస్తున్న తనను కాదని, రాష్ట్ర విభజన తర్వాత పార్టీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో ఆయన మనస్తాపం చెందారు. ఈ విషయాన్ని సన్నిహితులతో చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తొలుత ప్రకటించిన ఆయన సాయంత్రం తర్వాత ఎవరికీ అందుబాటులోకి రాకుండా పోవడం పలు ఊహాగానాలకు తెరలేపింది.  

  • Loading...

More Telugu News