SriReddy: ఏదైనా మాట్లాడితే కెరీర్ మొత్తం సర్వనాశనం అవుతుంది!: నటి అపూర్వ
- అన్యాయం గురించి మాట్లాడితే పబ్లిసిటీ స్టంట్ అంటారు
- ఆ నటిని పెట్టుకుంటే సమస్యలు వస్తాయని దూరం చేస్తారు
- మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక చర్చలో అపూర్వ
తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడితే కెరీర్ మొత్తం సర్వనాశనం అయిపోతుందని నటి అపూర్వ వ్యాఖ్యానించింది. పని చేస్తున్న చోట లైంగిక వేధింపులపై మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక ఓ చర్చను నిర్వహించగా, నటి శ్రీరెడ్డి, అపూర్వ తదితరులతో పాటు హక్కుల కార్యకర్త సుజాత సూరేపల్లి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అపూర్వ మాట్లాడుతూ, ఎవరైనా బాధితురాలు బయటకు వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడితే, పబ్లిసిటీ కోసం ఆరోపణలు చేస్తున్నారన్న విమర్శలు వస్తాయని, ఆపై ఆ నటి సమస్యలు సృష్టిస్తుందన్న ప్రచారం మొదలై, అవకాశాలు దూరమవుతాయని చెప్పింది.
నటి శ్రీరెడ్డి చెబుతూ, "టాలీవుడ్ లోని డైరెక్టర్లలో దాదాపు అందరూ సెక్సువల్ ఫేవర్స్ అడిగేవాళ్లే. చాలా మంది బయటకు వచ్చి విషయం చెప్పుకోరు. దానికి కారణం కెరీర్ పోతుందనే. హీరోకు రూ. 10 కోట్లు ఇచ్చే ఇండస్ట్రీ, హీరోయిన్ విషయానికి వచ్చే సరికి కోటి రూపాయలు ఇచ్చి సరిపెడుతుంది. లింగ సమానత్వం ఏ మాత్రమూ లేని ఇండస్ట్రీ ఇది" అని వ్యాఖ్యానించింది.