CBI Ex JD: ఏం చేయగలనన్న విషయమై అవగాహన వచ్చిన తరువాత ఓ నిర్ణయం తీసుకుంటా!: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అడుగుతున్నారని జోక్
- 'నన్ ఆఫ్ ది ఎబౌ' కూడా ఉందని వ్యాఖ్య
- రెండున్నర నెలల తరువాతే సమాధానం లభిస్తుంది
- ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో లక్ష్మీ నారాయణ
తాను చేస్తున్న ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ప్రజా జీవితంలోకి వచ్చి, ప్రస్తుతం జిల్లాలు తిరుగుతూ ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకుంటున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సొంతంగా రాజకీయ పార్టీ పెడతారా? మరో పార్టీలో చేరుతారా? లేక రాజకీయాలకు దూరంగా ఉండి ఏదైనా స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనలో ఉన్నారా? అన్న ప్రశ్నకు ఆయన సరదాగా, తెలివిగా సమాధానం ఇచ్చారు.
"మీరు ఆబ్జెక్టివ్ టైప్ లాగా అడుగుతున్నారు. నేను ఒక ఎస్ఏ క్వశ్చన్ కు ఆన్సర్ ఇస్తాను. రెండున్నర నెలల తరువాత. ఈ మూడింటితో పాటు 'నన్ ఆఫ్ ది ఎబౌ' కూడా ఉండవచ్చు. వెయిట్ అండ్ వాచ్..." అన్నారు. తన దృష్టి ప్రస్తుతం వ్యవసాయంపై ఉందని, రైతులకు ఏదైనా మేలు కలిగించే చర్యలు తీసుకోవాలని ఉందని చెప్పారు. ముందు తన సామర్థ్యాన్ని లెక్కించుకుంటున్నానని, తాను ఏం చేయగలనన్న విషయమై అవగాహన వచ్చిన తరువాత ఓ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఇంకో మూడు సంవత్సరాల ముందే ఉద్యోగాన్ని ఎందుకు వీడలేదా? అని ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయని, అప్పుడే ఉద్యోగాన్ని వీడివుంటే, ఈపాటికి తన లక్ష్యానికి మరింత దగ్గరై ఉండేవాడినని అన్నారు.