kanna lakshminarayana: సాయంత్రం వరకు టైమ్ ఇస్తున్నాం.. సోము వీర్రాజును అధ్యక్షుడిగా ప్రకటించండి!: బీజేపీ తూ.గో.జిల్లా అధ్యక్షుడి అల్టిమేటం
- వైసీపీలోకి వెళ్లాలనుకున్న కన్నాకు అధ్యక్ష పదవి ఇస్తారా?
- ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు
- జిల్లా క్యాడర్ మొత్తం రాజీనామాలు చేస్తాం
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించడం పట్ల ఎమ్మెల్సీ సోము వీర్రాజు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం విజయవాడలో రాష్ట్ర పార్టీ నేతల సమావేశం జరగనుందని... ఈలోగా పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును ప్రకటించాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య హెచ్చరించారు.
తమ హెచ్చరికను పెడచెవిన పెడితే జిల్లా కార్యవర్గం మొత్తం రాజీనామాలు చేస్తామని అన్నారు. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడినవారిని విస్మరించి, మొన్న పార్టీలోకి వచ్చి, నిన్న వైసీపీలోకి వెళ్లేందుకు యత్నించిన కన్నాకు అధ్యక్ష పదవిని ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కన్నాను అధ్యక్షుడిగా నియమించడం దౌర్భాగ్యమని చెప్పారు. పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంతో నిజాయతీగా పని చేస్తున్న బీజేపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.