Telangana: ఆ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలకు సిగ్గనిపించడం లేదా?: మంత్రి హరీశ్ రావు
- పంట పెట్టుబడి డబ్బుతో రైతులు బీర్లు తాగుతున్నారంటారా!
- బీజేపీ నేతలు రైతులకు క్షమాపణలు చెప్పాలి
- రాష్ట్రానికి ఏం చేయకపోగా రైతులను అవమానిస్తారా?
పంట పెట్టుబడి డబ్బుతో రైతులు బీర్లు తాగుతున్నారంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేయడం దారుణమని, అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు వారికి సిగ్గనిపించడం లేదా? అని తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సంగారెడ్డిలో రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, రాష్ట్రానికి ఏం చేయకపోగా రైతులను అవమానిస్తారా? అని ప్రశ్నించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడాన్ని కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని, వారి హయాంలో బ్యాంకుల చుట్టూ రైతులు తిరిగినా అప్పు పుట్టని పరిస్థితులుండేవని విమర్శించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత గీతారెడ్డి హాజరుకాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో గీతారెడ్డి పాల్గొనకపోవడాన్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
మన పథకాలను ఇతర రాష్ట్రాల్లో పార్టీలు తమ మేనిఫెస్టోల్లో పెడుతున్నాయి
జగిత్యాల జిల్లాలో రైతుబంధు చెక్కులను టీఆర్ఎస్ ఎంపీ కవిత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘రైతుబంధు’ దేశం గర్వించదగ్గ పథకమని ప్రశంసించారు. మన పథకాలను ఇతర రాష్ట్రాల్లో పార్టీలు తమ మేనిఫెస్టోల్లో పెడుతున్నాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా ‘తెలంగాణ’లో పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు చూసి ఇతర రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు ఆశ్చర్యపోతున్నారని అన్నారు.
‘రైతుబంధు’ విజయవంతంతో కాంగ్రెస్ నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి
రైతుబంధు పథకం విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతలకు చుక్కలు కనబడుతున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ఈ పథకాన్ని సూటిగా వ్యతిరేకించాలని, రాష్ట్రంలో ఇలాంటి ప్రతిపక్ష పార్టీ ఉండటం దురదృష్టకరమని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ చెప్పేవన్నీ తుపాకీ రాముడి మాటలేనని విమర్శించారు. కౌలు రైతులపై కాంగ్రెస్ పార్టీ మొసలికన్నీరు కారుస్తోందని దుయ్యబట్టారు.