BJP: బీజేపీ, కాంగ్రెస్ మధ్య 'టగ్ ఆఫ్ వార్'... వెనకే వస్తున్న జేడీఎస్!
- ఊపందుకున్న ఓట్ల లెక్కింపు
- 111 అసెంబ్లీ స్థానాల్లో వెల్లడవుతున్న ట్రెండ్స్
- కాంగ్రెస్ 43, బీజేపీ 42 చోట్ల ఆధిక్యం
కన్నడనాట ఓట్ల లెక్కింపు ఊపందుకుంది. మొత్తం 111 నియోజకవర్గాల్లో ట్రెండ్స్ వెల్లడయ్యాయి. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొని ఉండగా, జేడీఎస్ తన ఉనికిని చాటుకుంటోంది. ప్రస్తుతం కాంగ్రెస్ 43, బీజేపీ 42, జేడీఎస్ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మొత్తం 222 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల సరళిని పరిశీలిస్తుంటే, అత్యధిక ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, కాంగ్రెస్ నాయకులు ఎవరూ పార్టీ కార్యాలయం వద్ద కనిపించడం లేదు. ఫలితాల ట్రెండ్స్ ను పూర్తిగా చూసిన తరువాతే పార్టీ ఆఫీస్ కు వెళ్లాలని నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలను తెలుసుకుని, రాజకీయం నడిపేందుకు బెంగళూరుకు వచ్చిన గులాంనబీ ఆజాద్ ప్రస్తుతానికి హోటల్ కే పరిమితం అయ్యారు. మరోవైపు బీజేపీ కార్యాలయం వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది.