navjyoth singh sidhu: సిద్ధూకు ఊరట... దోషిగా ప్రకటించీ జరిమానాతో వదిలేసిన సుప్రీంకోర్టు
- 1988 నాటి దురుసు ప్రవర్తన కేసు
- రూ.1,000 జరిమానా విధింపు
- దిగువ కోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు
మాజీ క్రికెటర్, పంజాబ్ పర్యాటక మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూను 1988 నాటి రోడ్డుపై దురుసు ప్రవర్తన కేసులో దోషిగా సుప్రీంకోర్టు ఈ రోజు ప్రకటించింది. దురుసు డ్రైవింగ్ కారణంగా 65 ఏళ్ల వ్యక్తి గాయపడడానికి కారణమైనట్టు పేర్కొంటూ జైలు శిక్ష విధించకుండా విడిచిపెట్టింది. ఐపీసీలోని సెక్షన్ 323 కింద కేవలం రూ.1,000 జరిమానా విధిస్తూ జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ తో కూడిన ధర్మాసనం తీర్పు ప్రకటించింది.
ఈ కేసులో ఎ1గా ఉన్న సిద్ధును సెక్షన్ 323 కింద దోషిగా పేర్కొంటూ రూ.1,000 జరిమానా, ఏ2గా ఉన్న రూపిందర్ సింగ్ సంధు(సిద్ధు అనుచరుడు)ను నిర్దోషిగా విడుదల చేస్తూ తీర్పు చెప్పింది. దోషపూరిత ప్రాణనష్టానికి కారణమయ్యాడంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెడుతూ, కేవలం గాయపడడానికే కారణమయ్యాడంటూ జైలు శిక్ష విధించకుండా వదిలేసింది. నిజానికి సెక్షన్ 323 కింద ఏడాది వరకు జైలు శిక్ష లేదా రూ,1,000 జరిమానా విధించేందుకు కోర్టుకు అధికారాలున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు కారణంగా సిద్ధుకు పెద్ద ఊరట లభించినట్టే.