Congress: దేవెగౌడకు సోనియా గాంధీ ఫోన్.. ప్రభుత్వ ఏర్పాటుపై ఈ రోజు సాయంత్రం గవర్నర్ వద్దకు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు?
- దేవెగౌడ నివాసానికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు
- కుమారస్వామితో మాట్లాడతానని సోనియాకు చెప్పిన దేవెగౌడ
- అమితాసక్తి రేపుతోన్న ఎన్నికల ఫలితాలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అమితాసక్తి రేపుతున్నాయి. ఆ రాష్ట్రంలో బీజేపీకి అత్యధిక సీట్లు వస్తున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 112 ను అందుకోలేకపోయింది. ఓటర్లు ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ కీలకంగా మారింది. దీంతో దాదాపు 75 సీట్లకు పైగా సాధించే అవకాశం ఉన్న కాంగ్రెస్ కర్ణాటకలో అధికారాన్ని బీజేపీకి దక్కకుండా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.
ఇందుకోసం ఇప్పటికే వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తాజాగా జేడీఎస్ అధినేత దేవెగౌడకు ఫోన్ చేసినట్లు సమాచారం. కాంగ్రెస్‌కి మద్దతిచ్చే అంశంపై తాను కుమారస్వామితో ఫోన్‌లో మాట్లాడి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని దేవెగౌడ తెలిపినట్లు తెలిసింది.
అంతేకాదు, దేవెగౌడ నివాసానికి పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటికే బయలుదేరారు. ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్-జేడీఎస్ నేతలు ఆ రాష్ట్ర గవర్నర్‌ను కలువనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ పార్టీ.. జేడీఎస్ నేత కుమారస్వామికి ఇచ్చే అవకాశం ఉందన్న వార్త ఇప్పటికే బయటకు వచ్చిన విషయం తెలిసిందే.