East Godavari District: గోదావరిలో గల్లంతైన లాంచీని గుర్తించిన పోలీసులు!
- 40 అడుగుల లోతులో లాంచీ ఉన్నట్టు గుర్తింపు
- 3 బోట్ల సాయంతో లాంచీని బయటకు తీసే ప్రయత్నాలు
- ఇసుకలో కూరుకుపోయిన లాంచీ
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు - పశ్చిమగోదావరి జిల్లా కోండ్రుపేట సమీపంలోని వాడపల్లి మధ్య నిన్న సాయంత్రం గోదావరి నదిలో లాంచీ మునిగిపోయిన విషాద సంఘటన తెలిసిందే. ఈ సంఘటనలో 36 మంది ప్రయాణికులు గల్లంతు కాగా, 16 మంది సురక్షితంగా బయటపడ్డారు.
నిన్న సాయంత్రం వీచిన పెనుగాలులకు అదుపుతప్పి గల్లంతైన లాంచీని ఎట్టకేలకు గుర్తించారు. సహాయకచర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు బృందాలు పాల్గొన్నాయి. హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. నీట మునిగిన లాంచీ ఆచూకీని కనుగొన్నారు. 40 అడుగుల లోతులో లాంచీ ఉన్నట్టు గుర్తించారు. 3 బోట్ల సాయంతో లాంచీని బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. లాంచీ ఇసుకలో కూరుకుపోవడంతో బయటకు తీయడం కష్టసాధ్యంగా మారినట్టు సమాచారం. సహాయక చర్యలను ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు.