karnataka: కర్ణాటక గవర్నర్ ముందున్న మూడు ప్రత్యామ్నాయాలు ఇవే!
- కర్ణాటకలో ఏ పార్టీకీ దక్కని మెజారిటీ
- రాజ్ భవన్ కు మారిన పొలిటికల్ సీన్
- మోదీకి అత్యంత సన్నిహితుడు కర్ణాటక గవర్నర్
కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో... అక్కడి రాజకీయ పరిణామాలు ఉత్కంఠభరితంగా మారాయి. ఇప్పుడు పొలిటికల్ సీన్ మొత్తం రాజ్ భవన్ కు మారింది. గవర్నర్ వజూభాయ్ వాలా తీసుకునే నిర్ణయంపైనే కర్ణాటక రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంది. అధికారాన్ని దక్కించుకోవడానికి ఒకవైపు బీజేపీ, మరోవైపు జేడీఎస్, కాంగ్రెస్ కూటమి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, గవర్నర్ ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అవి ఏంటంటే...
- సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం. బల నిరూపణ కోసం ఆ పార్టీకి గడువు ఇవ్వడం.
- కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన కుమారస్వామిని ఆహ్వానించడం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరడం. ఈ రెండు పార్టీలకు కలిపి 116 సీట్లు ఉన్నాయి. దీంతో, మ్యాజిక్ ఫిగర్ కంటే ఈ కూటమికి ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు.
- చివరి ప్రత్యామ్నాయం అత్యంత వివాదాస్పదమైనదిగానే చెప్పుకోవచ్చు. అదేంటంటే... ఏ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా అసెంబ్లీని సస్పెన్షన్ లో ఉంచడం.
మరోవైపు, నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన వజూభాయ్ వాలా... ప్రభుత్వ ఏర్పాటుకు కుమారస్వామికి తొలి అవకాశం దాదాపు ఇవ్వకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు... ఆయన కేబినెట్లో వజూభాయ్ ఉన్న విషయం గమనార్హం. ఈ నేపథ్యంలో, ఫస్ట్ ఛాన్స్ యడ్యూరప్పకే ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ యడ్యూరప్ప బలనిరూపణలో విఫలమైతేనే కుమారస్వామికి అవకాశం దక్కే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇక మూడో ప్రత్యామ్నాయం అవసరం రాకపోవచ్చనే అంటున్నారు.