KTR: కేటీఆర్ ఇక యాంకరింగ్ చేసుకోవాల్సిందే: రేవంత్ రెడ్డి
- వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటమి తప్పదు
- ఇటీవల జేడీఎస్‌కు కేసీఆర్ మద్దతిచ్చారు
- ఇప్పుడు జేడీఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో చెప్పాలి
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటమి తప్పదని, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇక యాంకరింగ్ చేసుకోవాల్సిందేనని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కర్ణాటకలో బీజేపీ అక్రమ మార్గంలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని అన్నారు. ఇటీవల జేడీఎస్‌కు మద్దతిచ్చిన కేసీఆర్ ఇప్పుడు జేడీఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో చెప్పాలని వ్యాఖ్యానించారు.
గతంలో గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుందని, అయినప్పటికీ అక్కడ గవర్నర్ బీజేపీకి అవకాశం ఇవ్వడం దారుణమని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే మణిపూర్, మేఘాలయాల్లో ఎన్నికల తర్వాత ఏర్పాటైన కూటములకు గవర్నర్లు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు భారత రాజ్యాంగంపై నమ్మకంలేదని, వారు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని అన్నారు. బీజేపీకి అనుకులంగా వ్యవస్థలను మార్చుకోవడమేంటని ప్రశ్నించారు.