TTD: టీటీడీ సంచలన నిర్ణయంతో పదవీ విరమణ పొందనున్న రమణ దీక్షితులు
- పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్న టీటీడీ
- 65 ఏళ్లు దాటిన అర్చకులను తొలగించాలంటూ సంచలన నిర్ణయం
- రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై వివరణ కోరతామన్న సింఘాల్
పాలకమండలి సమావేశంలో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు దాటిన అర్చకులను తొలగించాలని నిర్ణయించింది. కొత్త పాలకమండలి నిర్వహించిన తొలి సమావేశంలోనే ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులతో పాటు నరసింహ దీక్షితులు, శ్రీనివాసమూర్తి దీక్షితులు, నారాయణ దీక్షితులు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు, టీటీడీ బ్యాంకు డిపాజిట్లు, ఎఫ్ఎంఎస్ పనితీరుపై సబ్ కమిటీలు వేయాలని పాలకమండలి నిర్ణయించింది. పునర్వసు నక్షత్రం రోజున శ్రీనివాసమంగాపురం, చంద్రగిరి కోదండరామస్వామి ఆలయాల్లో ఆర్జిత కల్యాణం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
మరోవైపు, రమణ దీక్షితులు ఇటీవల చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి ఆలయంలోని ఆచార వ్యవహారాలపై పలు విమర్శలు గుప్పించారు. దీనిపై టీటీడీ కార్యనిర్వాహక అధికారి సింఘాల్ మాట్లాడుతూ, రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై వివరణ కోరతామని చెప్పారు.