kumara swamy: 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు గవర్నర్‌కు లేఖ సమర్పించాం: కుమారస్వామి
- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం మాకు ఉంది
- కాంగ్రెస్-జేడీఎస్ పక్షాల గెలిచిన వారంతా మాతోనే ఉన్నారు
- గవర్నర్ సరైన నిర్ణయం ప్రకటిస్తారనుకుంటున్నాం
కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరన్న ఉత్కంఠ కొనసాగుతోంది. రాజ్‌భవన్‌లో గవర్నర్ విజుభాయ్ రుడాభాయ్ వాలాను జేడీఎస్ నేత కుమారస్వామి, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం తమకు ఉందని గవర్నర్‌కి తెలిపారు. 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు గవర్నర్‌కు లేఖ సమర్పించారు. అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.... కాంగ్రెస్-జేడీఎస్ పక్షాల గెలిచిన వారంతా తమతోనే ఉన్నారని తెలిపారు.
గవర్నర్ రాజ్యాంగబద్ధంగా సరైన నిర్ణయం ప్రకటిస్తారని విశ్వసిస్తున్నామని, ఆయన రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారని నమ్ముతున్నామని కుమారస్వామి వ్యాఖ్యానించారు. కేపీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ... రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారని, ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలను పిలిచే క్రమంలో న్యాయ నిపుణులను సంప్రదిస్తామని అన్నారని తెలిపారు.