Mahanati: ‘మహానటి’పై జెమినీ గణేశన్ కుమార్తె ఆగ్రహం.. సావిత్రి కంటే ముందే మా అమ్మను పెళ్లాడారన్నకమలా సెల్వరాజ్
- ‘మహానటి’లో నాన్న పాత్రను తప్పుగా చిత్రీకరించారు
- ఆయన జీవితానికి కళంకం తెచ్చిపెట్టారు
- సావిత్రే నాన్నకు మద్యం అలవాటు చేసింది
- ఇంటికెళ్తే కుక్కలను ఉసిగొల్పారు
- జెమినీ గణేశన్ కుమార్తె కమలా సెల్వరాజ్
మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ద్విభాషా చిత్రంగా రూపొందించిన ‘మహానటి’ సినిమా చిత్ర యూనిట్‌పై సావిత్రి భర్త జెమినీ గణేశన్ కుమార్తె, ప్రముఖ వైద్యురాలు కమలా సెల్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా తెలుగులో ‘మహానటి’గా విడుదల కాగా, తమిళంలో ‘నడిగర్ తిలగం’ పేరుతో విడుదలైంది.
సినిమా చాలా బాగుందని సావిత్ర కుమార్తె విజయ చాముండేశ్వరి ప్రశంసలు కురిపించగా, కమలా సెల్వరాజ్ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సినిమాలో తన తండ్రి పాత్రను తప్పుగా చిత్రీకరించారని, ఆయనకు కళంకం తెచ్చిపెట్టారని ఆరోపించారు. కెరీర్ మొత్తం బిజీగా ఉన్న తన తండ్రిని అవకాశాలు లేక ఖాళీగా కూర్చున్నట్టు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సావిత్రి కంటే ముందే జెమినీ గణేశన్ తన తల్లిని పెళ్లాడి ఇద్దరు పిల్లలను కూడా కన్నారని గుర్తు చేశారు. తొలి ప్రేమ సావిత్రిపై కాదని, తన తల్లిపైనేనని అన్నారు. సినిమాలో చూపించినట్టు సావిత్రికి నాన్న మద్యం అలవాటు చేయలేదని, సావిత్రే తన తండ్రికి మద్యాన్ని అలవాటు చేసిందని తెలిపారు. ప్రేక్షకులు జెమినీ గణేశన్‌ను అంగీకరించకుంటే ‘కాదల్ మన్నన్’ (ప్రేమరాజు) అనే బిరుదు ఎందుకిస్తారని కమలా సెల్వరాజ్ ప్రశ్నించారు. సావిత్రిని కాపాడింది తన తండ్రే అని పేర్కొన్నారు.
‘ప్రాప్తం’ సినిమా నుంచి వెనక్కు తగ్గాలని చెప్పడానికి నాన్నతో కలిసి తాను కూడా సావిత్రి ఇంటికి వెళ్తే కుక్కలను ఉసిగొల్పి గెంటేశారని, వాటి నుంచి తప్పించుకునేందుకు గోడ దూకి పారిపోయామని కమలా సెల్వరాజ్ గుర్తు చేసుకున్నారు.