nakka anand babu: వైయస్ హయాంలో జరిగినవన్నీ ప్రభుత్వ హత్యలేనా?: మంత్రి నక్కా ఆనందబాబు
- జగన్ తీరు శవాలపై పైసలు ఏరుకునేలా ఉంది
- గిరిజనులు చనిపోతే.. వారి కుటుంబాలను పరామర్శించలేరా?
- కన్నా లక్ష్మీనారాయణ వైఖరి హాస్యాస్పదంగా ఉంది
గోదావరి నదిలో జరిగిన లాంచీ ప్రమాదానికి ప్రకృతి వైపరీత్యమే కారణమని మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. దురదృష్టకరమైన ఈ ఘటనపై మానవత్వం ఉన్న ఎవరైనా స్పందిస్తారని... కానీ, ప్రతిపక్ష నేత జగన్ తీరు మాత్రం సిగ్గుపడేలా ఉందని అన్నారు. ప్రతి వారం కోర్టుకు వెళ్లేందుకు పాదయాత్రను ఆపే జగన్ కు... గిరిజనులు చనిపోతే వారి కుటుంబసభ్యులను పరామర్శించే బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. పైగా ఇవన్నీ ప్రభుత్వ హత్యలని జగన్ చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. జగన్ తీరు శవాలపై పైసలు ఏరుకునే విధంగా ఉందని మండిపడ్డారు.
వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో ఘటనలు ఎన్నో జరిగాయని... అవన్నీ కూడా సర్కారీ హత్యలేనా? అని ఆనందబాబు ప్రశ్నించారు. మక్కా మసీదులో బాంబులు పేలాయని... ఆ బాంబులను ప్రభుత్వమే పెట్టించిందా? అని నిలదీశారు. ఇక బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంఘ్ పరివార్ కార్యకర్తలా మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందని ఆనందబాబు ఎద్దేవా చేశారు.
వారం రోజుల్లో వైసీపీ, బీజేపీలతో కన్నా దోబూచులాడారని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో సీఎం పదవి కోసం పాకులాడారని... ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పాకులాడారని విమర్శించారు. కన్నాకు సిగ్గు లేకపోయినా... ఆయనకు బ్యానర్లు కట్టే కార్యకర్తలకైనా సిగ్గుండాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.