mk stalin: బేరసారాలకు అవకాశం ఇవ్వడమే: కర్ణాటక గవర్నర్ నిర్ణయంపై ఎంకే స్టాలిన్
- గవర్నర్ నిర్ణయం ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధం
- ప్రజాస్వామ్య పునాదులను కూల్చేస్తుంది
- ట్విట్టర్లో తన అభిప్రాయాలను పోస్ట్ చేసిన స్టాలిన్
పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి అవకాశం ఇస్తూ గవర్నర్ వాజుభాయి తీసుకున్న నిర్ణయాన్ని డీఎంకే ముఖ్యనేత ఎంకే స్టాలిన్ తప్పుబట్టారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు పెట్టుకున్నప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తూ గవర్నర్ తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని స్టాలిన్ పేర్కొన్నారు.
ఈ విధమైన నిర్ణయం బేరసారాలకు వీలు కల్పించడమమేనని ఆయన విమర్శించారు. ప్రజస్వామ్య పునాదులను ఇది కూల్చేస్తుందన్నారు. స్టాలిన్ తమిళనాడులోనూ బీజేపీ చర్యలను ఎత్తి చూపారు. సభలో మెజారిటీ లేకపోయినా, అవినీతి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కాపాడేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలు, విలువలు ప్రమాదంలో పడ్డాయని అభిప్రాయపడ్డారు.