ke krishna murthy: రమణ దీక్షితులుపై విచారణ జరిపి, చర్యలు తీసుకుంటాం: కేఈ కృష్ణమూర్తి
- ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు ఎన్నో తప్పులు చేశారు
- రాజకీయ దీక్ష తీసుకున్న వ్యక్తిలా వ్యవహరిస్తున్నారు
- విచారణ జరిపి, చర్యలు తీసుకుంటాం
తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుపై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాన అర్చకుడిగా ఉంటూ రమణ దీక్షితులు ఎన్నో తప్పులు చేశారని, సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఏడు కొండల గురించి చెడుగా మాట్లాడిన రాజకీయ నాయకులకు ఎలాంటి గతి పట్టిందో అందరికీ తెలుసని చెప్పారు. స్వామివారి నగలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని అన్నారు. ప్రతి యేటా స్వామివారి నగలను అధికారులు పరిశీలిస్తారని చెప్పారు.
రమణ దీక్షితులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని... గతంలో ఆయన చేసిన తప్పులపై కూడా విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని తెలిపారు. రమణ దీక్షితులు అర్చక వృత్తిని మరిచిపోయి, రాజకీయ దీక్షను తీసుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఎవరు మాట్లాడినా, ఉపేక్షించబోమని హెచ్చరించారు.