goa: మా పార్టీయే అతిపెద్ద పార్టీ కదా, మరి ప్రభుత్వ ఏర్పాటుకు మాకూ అవకాశం ఇవ్వండి!: గోవా కాంగ్రెస్ డిమాండ్
- గోవాలో కర్ణాటక ఫార్ములా
- గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము 17 సీట్లు గెలిచాం
- బీజేపీ 13 మాత్రమే గెలిచింది
- రేపు గోవా రాజ్‌భవన్ ముందు పెరేడ్
ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ 117 మంది ఎమ్మెల్యేలతో ముందుకు వచ్చిన జేడీఎస్-కాంగ్రెస్‌ను కాదని, కర్ణాటకలో అతి పెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీకి ఆ రాష్ట్ర గవర్నర్ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బీజేపీ తీరును కాంగ్రెస్ పార్టీ ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. రేపు గోవా రాజ్‌భవన్ ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెరేడ్ నిర్వహించనున్నారు.
గత ఏడాది తమ రాష్ట్రంలో 40 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము 17 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించామని, అయినప్పటికీ 13 సీట్లే గెలిచిన బీజేపీకి గవర్నర్ అవకాశం ఇచ్చారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత యతీశ్ నాయక్ అన్నారు. కానీ, కర్ణాటకలో మాత్రం అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీనే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని, కాబట్టి ఇప్పుడు తమ గవర్నర్ ముందు ఓ డిమాండ్ ఉంచుతున్నామని అన్నారు. గోవాలో ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని అన్నారు.